మాజీ మంత్రి, TDLP ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. ESI మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసింది ఏసీబీ. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన నివాసంలో ఉండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7 గంటల 20 నిమిషాలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని స్వగృహంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసులు గోడదూకి, ఇంట్లోకి చొరబడి మరీ అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. ఇక, అచ్చెన్నాయుడుని నిమ్మాడ నుంచి విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా గొల్లపూడిలోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, ఏసీబీ కోర్టు సమయం ముగిసిపోవడంతో.. న్యాయమూర్తి తన ఇంటికి వెళ్లిపోయారు. దీంతో అరెస్ట్, కోర్టులో హాజరు ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత.. మంగళగిరిలోని జడ్జి నివాసంలోనే అచ్చెన్నాయుడును హాజరుపరిచే అవకాశం వుంది.