మాజీ మంత్రి, TDLP ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. ESI మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసింది ఏసీబీ. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన నివాసంలో ఉండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా గొల్లపూడిలోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 7 గంటల 20 నిమిషాలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని స్వగృహంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసులు గోడదూకి, ఇంట్లోకి చొరబడి మరీ అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. అటు ఈఎస్‌ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడితో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. IMS మాజీ డైరెక్టర్ సీకే రమేష్ కుమార్‌ను తిరుపతిలో, డాక్టర్ విజయ్ కుమార్‌ను రాజమండ్రిలో అరెస్ట్ చేశారు. వీరితోపాటు.. డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ జనార్ధన్‌రావు, రమేష్‌బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో ఏసీబీ అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అచ్చెన్నాయుడి కుటుంబం దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. ఆయన మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యే. అంతేకాదు TDLP ఉప నేతగానూ ఉన్నారు. అలాంటి సీనియర్ నేతను అరెస్ట్ చేసేప్పుడు అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలి. కానీ ఏసీబీ అధికారులు స్పీకర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. పైగా అచ్నెన్నాయుడికి ఆరోగ్యం బాగోలేదు. 3 రోజుల క్రితమే సర్జరీ జరిగింది. విశ్రాంతి కోసం ఇంటికి వచ్చిన సమయంలోనే అరెస్ట్ చేశారు. 5 నిమిషాల్లోనే అరెస్ట్ ప్రక్రియను పూర్తి చేసింది ఏసీబీ. ఆయన గన్‌మెన్‌ను కూడా అనుమతించలేదు.
ఉదయాన్నే దాదాపు 15 వాహనాల్లో పోలీసులు తమ ఇంటికి వచ్చారని అచెన్నాయుడు భార్య విజయమాధవి చెప్పారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు. కనీసం ట్యాబ్లెట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు. 5 నిమిషాలు కూడా ఇంట్లో నిలబడనివ్వకుండా హడావుడిగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలకు సరిగ్గా 4 రోజుల ముందు అచ్చెన్నాయుడని అరెస్ట్ చేయడంపై దుమారం రేగుతోంది. ప్రభుత్వ తీరుపై టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇది అరెస్ట్ కాదు కిడ్నాప్ అని ఆరోపించింది. అటు ఏసీబీ మాత్రం అంతా ప్రొసీజర్ ప్రకారమే చేశామంటోంది.