ఇంత జరుగుతున్నా ఇంకా అజాగ్రత్తగానే ఉంటున్నారు. కరోనా మహమ్మారిని తక్కువగా అంచనా వేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా విందులు, వినోదాల పేరుతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు.. వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. వెల్దుర్తి మండలం ఎల్.తండాకు చెందిన యువతిని ఈనెల 10వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఎందుకైనా మంచిదని పెళ్లికి ముందే కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.
కానీ రిపోర్ట్ రాకముందే అమ్మాయి మెళ్లో మూడు ముళ్లు వేశాడు. కొద్ది మంది బంధువల సమక్షంలో అయినా వివాహ వేడుకను ఘనంగానే నిర్వహించారు ఇరు కుటుంబాల వారు. అదే రోజు రాత్రి జరిగిన రిసెప్షన్లో పెళ్లి కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా కరోనా పాజిటివ్ అని తేలింది. పెళ్లి వేడుకల్లో సహపంక్తి భోజనాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే పత్తికొండ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి 70 కుటుంబాలను కరోనా పరీక్షలకు పంపించారు. బంధువులతో పాటు పెళ్లి కుమార్తెను క్వారంటైన్ కు.. పెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం ఐసోలేషన్ కు తరలించారు.