అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం తరలించారు. వాళ్లిద్దరి అరెస్టులను నిరసిస్తూ.. జేసీ అభిమానులు, టీడీపీ అనుచరులు రోడ్డెక్కారు. నిరసనలు చేపట్టారు. దీంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు. ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వన్ టౌన్ పీఎస్ పరిధిలో పోలీసులను మోహరించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇదంతా రాజకీయ కుట్రగా జేసీ కుటుంబ సభ్యులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. తమ కుటుంబంపై 24 కేసులు పెట్టారని.. గుర్తుచేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని చంద్రబాబుతో అన్నారు.