మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ల అరెస్ట్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఖండించారు. బీసీ నేత అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి , అస్మిత్ రెడ్డి లను అరెస్ట్ చేసారని అన్నారు. 16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 జగన్ రెడ్డి, టిడిపి నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నాడని విమర్శించారు.
ఏడాది పాలనలో ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైందన్న లోకేశ్.. ఆయనను అభద్రతా భావం వెంటాడుతోందని అన్నారు. అందుకే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెరలేపారని.. ప్రలోభాలకు లొంగితే వైకాపా కండువా. లొంగకపోతే జైలుకు తరలిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ప్రతిపక్ష నేతల పై వేధింపులు, కక్ష తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉందన్న ఆయన సమర్థవంతంగా జగన్ గవర్నమెంట్ 'టెర్రరిజాన్ని' ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్ రెడ్డి ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.