అచ్చెన్నాయుడు విషయంలో ఏసీబీ తీరుపై సర్వత్రా విమర్శలు

Update: 2020-06-14 12:47 GMT

ESI మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందట ఆయనకు శస్త్రచికిత్స జరగడం, అరెస్ట్ తర్వాత పోలీసులు గంటల తరబడి వాహనంలో తిప్పడంతో ఆపరేషన్‌ గాయం తిరగబెట్టింది. రక్తస్రావం కూడా జరగడంతో అచ్చెన్నాయుడును GGHకు తరలించారు. ప్రస్తుతం చికిత్స చేస్తున్నామని.. రెండు మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారని GGH సూపరింటెండెండ్ సుధాకర్ తెలిపారు‌. ప్రస్తుతం బీపీ మందులు కొనసాగిస్తున్నామన్నారు. షుగర్‌ లెవల్ నార్మల్‌గానే వుందని చెప్పారు.

అంతకుముందు అచ్చెన్నాయుడును రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ1గా రమేష్‌ కుమార్‌ను చేర్చిన పోలీసులు.. ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా ప్రమోద్ రెడ్డి పేర్లను చేర్చారు. అచ్చెన్నాయుడు మంత్రిగా వున్న సమయంలో ESI మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్టు ఏసీబీ చెబుతోంది. అటు, ఈ అరెస్ట్ పరిణామాలపై TDP అధినేత తీవ్రంగా మండిపడ్డారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టుచేసి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని అన్నారు.

ఇదిలావుంటే, అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా.. టీడీపీ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలను సాగిస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. కనీసం ఓ నోటీసు కూడా లేకుండా.. ఎలాంటి అభియోగాలు మోపారో కూడా చెప్పకుండా అచ్చెన్నాయుడను అరెస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకు సర్జరీ జరిగిందని.. మెడికల్ రిపోర్ట్స్ కూడా చూపించినప్పటకీ.. ఏసీబీ అమానుషంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆపరేషన్ సంగతి తమకు ముందుగా తెలియదని ఏసీబీ అధికారులు చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

Similar News