అక్రమ కేసులు, అరెస్టులతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారంటూ మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..అరెస్టులతో నేతల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా భరోసా ఇస్తున్నారు. మొన్న అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టుకు తరలించిన సమయంలో ఆయన కూడా అక్కడి వెళ్లారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టుతో ఆవేదనలో ఉన్న జేసీ కుటుంబాన్ని ఆయన ఇవాళ పరామర్శించనున్నారు. ఇందుకోసం ఆయన నేడు అనంతపురానికి వెళ్లనున్నారు.
అయితే..నారా లోకేష్ ఆదివారమే అనంతపురం వెళ్లాల్సి ఉండగా..చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది. నకిలీ NOCల కేసులో.. అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య కడప జైలుకు తరలించారు. దీంతో అనంత పర్యటనను రద్దు చేసుకున్న లోకేష్ ఈ రోజు కడప వెళ్లి జేసీ ప్రభాకర్, అస్మిత్ రెడ్డిని పరామర్శించాలని అనుకున్నారు. కానీ, ఆయన పర్యటనకు అనుమతి అధికారులు ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ములాఖత్‌కు అవకాశం కల్పించలేమని చెప్పారు. దీంతో కడప పర్యటన నిర్ణయాన్ని రద్దు చేసుకున్న లోకేష్..నేరుగా అనంతపురం వెళ్లి జేసీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్ట్ పై JC కుటుంబం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ సర్కార్ ఫ్యాక్షన్ రాజకీయానికి తెరలేపిందని దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లతో బెదిరించాలని చూసినా అదిరేది లేదన్నారు. అరెస్టులపై న్యాయపోరాటం చేస్తామని జేసీ కుటుంబసభ్యులు చెబుతున్నారు.
జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందని ఆరోపించారు. ఏపీని అరాచకప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలకు 70MM సినిమా మొదలవుతుందని హెచ్చరించారు బుద్దా వెంకన్న. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్టులకు నిరసనగా టీడీపీ కార్యక్తలు, JC అనుచరులు పలుచోట్ల నిరసనలకు దిగారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. కడపతోపాటు అనంతపురం జిల్లాలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.