కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు.. కరోనా కట్టడిలో వైఫల్యాలు.. ఇవి కప్పిపుచ్చుకోవడానికేనా?
కోర్టుల్లో వరుసగా అన్ని వ్యతిరేక తీర్పులు..మరోవైపు కరోనా కట్టడిలో వైఫల్యాలు..ఎల్జీ పాలిమర్స్ దర్యాప్తు, దళితులపై వేధింపులు ఇలా అన్ని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఓ మార్గం కావాలి. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి..వైఫల్యాల ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. ప్రశ్నించే వారు ఇంకా భయపడిపోవాలి. ప్రతిపక్షాలు నోరు మూసుకోవాలి. అందుకు ఏం చెయ్యాలి? ప్రస్తుతం ఏపీలో రాజుకున్న రాజ్యహింసే ఈ ప్రశ్నకు సమాధానం. వైఫల్యాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణిని మరింత తీవ్రం చేసిందనేది టీడీపీ వాదన. అందులో భాగంగానే టీడీపీ నేతల వరుస అరెస్టులతో ప్రతిపక్షాల శిబిరంలో కల్లోలం రేపి..ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. రాజకీయ పబ్బం గుడుపుకునేందుకు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని వేధిస్తుండటంపై టీడీపీ గళమెత్తితోంది. అక్రమ కేసులు, అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రమంతా కాగడాలు, క్యాండిల్ ర్యాలీలతో నిరసన జ్వాల రాజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు.
ఏపీలో పులివెందుల పంచాయితీలు చేస్తూ ...రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదని సీఎం జగన్‌ను హెచ్చరించారు చంద్రబాబు. బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని పక్కదారి పట్టించేందుకే..అచ్చెన్నాయుడిని హడావుడిగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సర్జరీ అయిన వ్యక్తి పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. నవరత్నాలు కాదు... నవ మోసాలంటూ జగన్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ రిలీజ్ చేస్తే ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు చంద్రబాబు. అవినీతి జరిగిందన్న తప్పుడు ఆరోపణలతో..పోలవరం, అమరావతిని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం పిలుపుతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని దేవినేని ఉమ అన్నారు. టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు లాంతరుతో నిరసన ప్రదర్శన చేపట్టారు.. తన నివాసంలో లాంతరుతో తన నిరసనను తెలియజేశారు.. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. అక్రమ అరెస్టులను ఖండించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పుడతోందని మాగంటి బాబు మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన చేపట్టారు.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును నిరసిస్తూ జిల్లా టీడీపీ నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.. దేవరపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద కాగడాలతో నిరసన తెలియజేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. తెలుగుదేశం నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తిరుపతిలో ఆందోళన చేపట్టారు ఆ పార్టీ నేతలు. FIR కాపీలను తగులబెట్టారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.