మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆరోగ్యశాఖ కొన్ని సూచనలు చేసింది. కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ అంతా జాగ్రత్తగా ఉండాలంది. వైద్యారోగ్య శాఖ గైడ్‌లైన్స్‌పై ప్రజాప్రతినిధుల్ని అప్రమత్తం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఓ నోట్ పంపించారు. సభ్యులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. అంతా 2 మీటర్ల భౌతికదూరం పాటించాలి. అలాగే సభా మందిరంలోకి వచ్చేప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్ కూడా అయిన తర్వాతే లోపలికి వెళ్లాలి. లాబీలు, గ్యాలరీల్లో సభ్యులు గుమికూడి ఉండొకూడదు. లిఫ్ట్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మంది వెళ్లొద్దని సూచించారు. 60 ఏళ్లు పైబడిన సభ్యులు మరింత జాగ్రత్తగా ఉండాలని, మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంత్రులు సహా ఎవ్వరూ పీఎస్‌లు, పీఏలను తీసుకురావొద్దని అసెంబ్లీ కార్యదర్శి కోరారు. అసెంబ్లీలోకి సందర్శకులకు అనుమతి లేదని, అలాగే సభ ఆవరణలో ఆందోళనలకు అనుమతి లేదని వివరించారు.