ESI కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఏసీబీ కోర్టుకు విన్నవించారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తున్నందుకే తనపై కేసు పెట్టారని అన్నారు. 2017లోనే మంత్రిగా వైదొలిగిన తనపై.. 2020 జూన్ 10న కేసు నమోదు చేశారని అన్నారు. అవినీతి ఆరోపణల్లో మూడు నెలల తర్వాత ఫిర్యాదు అందితే.. కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీం కోర్టు తీర్పులో వుంది. కానీ, తనపై జూన్ 10న ఫిర్యాదు చేస్తే.. విచారణ జరుపకుండా అదేరోజు కసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు అచ్చెన్నాయుడు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు.
తన సోదరుడు దివంగత ఎర్రన్నాయుడు 2011లో అప్పటి సీఎం తనయుడు, ప్రస్తుత సీఎం జగన్‌పై అధికార దుర్వినియోగంపై.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అన్నారు అచ్చెన్నాడు. ఆ తర్వాత సీబీఐ విచారణ జరిపి ప్రస్తుత సీఎం జగన్, ఆయన సహచరులు, కంపెనీలపై కేసు పెట్టి.. 16 నెలల పాటు జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పటి నుంచి తమ కుటుంబంపై కక్ష పెంచుకుని తనను కేసులో ఇరికించారని కోర్టుకు విన్నవించారు అచ్చెన్నాయుడు. అంతేకాదు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవడానికే తను అరెస్ట్ చేశారని అన్నారు. తనకు ఆపరేషన్ జరిగిందని చెప్పినా వినకుండా 600 కిలోమీటర్లు కారులో తిప్పారని అన్నారు. తన అరెస్ట్‌కు ప్రభుత్వ ఆమోదం ఉందని ఆరోపించారు. తనకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు దర్యాప్తు అధికారి రిమాండ్ నివేదికలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు.