గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగంలో 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. పరిపాలనా వికేంద్రీకరణ కీలక అంశంగా పేర్కొన్నారు. 3 రాజధానుల అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఏర్పాటు అంశం శాసన ప్రక్రియలో ఉందన్నారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని స్పష్టం చేశారు.
గవర్నర్‌తో 3 రాజధానుల ప్రకటన చేయించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంశం కోర్టులో పరిధిలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగంలో ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు ప్రభుత్వ తీరుపై అమరావతి జేఏసీ, రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానులపై ప్రకటన చేశారు సీఎం జగన్. 2019 డిసెంబర్ 17న ఒక రాష్ట్రం, మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇదే అంశం ఏర్పాటు చేసిన GN రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇంకా తమ నివేదకలు ఇవ్వకముందే సీఎం 3 రాజధానులు అంటూ లీకులు ఇవ్వడంపై అప్పట్లో దుమారం రేగింది. ఆ మరుసటి రోజు నుంచే అమరావతి ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. పరిపాలన వికేంద్రీకరణ, CRDA చట్టం రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి వాటిని మండలికి పంపింది. అయితే ఆ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు మండలి ఛైర్మన్ షరీఫ్. తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ ఏకంగా మండలినే రద్దు చేస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం మండలి రద్దు అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. అటు రాజధాని తరలింపు అంశంపై ఇప్పటికే హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఇంతలోనే రాష్ట్రంలో కరోనా విజృంభించడంతో 3 రాజధానుల అంశానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయింది. మళ్లీ గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశాన్ని చేర్చడం ఒక్కసారిగా కలకలం రేపింది.