మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు ఎవరు చూడాలి? లీగల్‌గా ఎవరు వారసులు అవుతారు? ఇప్పుడు ఇదే విషయం తెరపైకి వచ్చింది. ఇటీవలే ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా సంచయిత బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఆనంద గజపతిరాజు రెండవ భార్య ఉమా గజపతిరాజు, ఆమె కుమార్తె దీనిపై న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ఆనంద గజపతిరాజుకు అసలైన వారసులం తామేనంటూ వీలునామాను, అలాగే కొన్ని ఆధారాలను చూపిస్తున్నారు. మొదటి భార్యతో విడాకుల తర్వాత చట్టపరంగా వారసత్వ హక్కులన్నీ తమకే సంక్రమిస్తాయని గుర్తు చేస్తున్నారు. 1991లోనే సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారని చెప్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం సంచయితను వారసురాలిగా గుర్తిస్తూ మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు.
ప్రస్తుతం చట్టపరంగా చూస్తే తామే వారసులమని సుధా గజపతిరాజు, ఆమె కుమార్తె ఊర్మిళా గజపతిరాజు చెప్తున్నారు. తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విషయంలోనూ సంచయిత వివాదాలు సృష్టిస్తున్నారని, తమపైనే కేసులు పెడుతున్నారని.. వాటికి లీగల్‌గానే సమాధానం చెప్తామని అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సుధ, ఊర్మిళ ఇటీవలే విశాఖ వచ్చారు. గజపతుల కుటుంబంలో తాము కూడా ఉన్నామనే విషయాన్ని ప్రజలకు తెలియచేసేందుకే తాము రావాల్సివచ్చిందన్నారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని.. కేవలం వారసత్వంపై మాత్రమే తాము మాట్లాడుతున్నామని అన్నారు.