ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు 300 మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 246 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 52 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కూడా కరోనా సోకింది. వీరితో కలుపుకుంటే పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరింది.దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేల 500లకు చేరువైంది.
24 గంటల్లో 15 వేల 173 శాంపిల్స్ పరీక్షించగా..304 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 47 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక కరోనా బారిన పడి కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5 వేల 87 కేసులు నమోదు కాగా.. 2 వేల 770 మంది డిశ్చార్జ్ అయ్యారు. 86 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2 వేల 231 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి లెక్కలను ఎప్పటిలాగే ప్రత్యేకంగా విడుదల చేసింది ఏపీ ఆరోగ్యశాఖ. విదేశాల నుంచి వచ్చినవారిలో 210 మందికి పాజిటివ్ రాగా.. ప్రస్తుతం 187 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1159 మంది కరోనా బారిన పడగా.. కొత్తగా 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 567 మంది చికిత్స పొందుతున్నారు. కొత్త కేసుల్లో ఎక్కువగా తమిళనాడులోని కోయంబేడు ప్రాంతం నుంచి వచ్చిన వారే ఉన్నారు.
విదేశాల నుంచి వచ్చినవారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కూడా కలుపుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వేల 456 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3 వేల 385 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు 86 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 985 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.