సంక్షేమానికి నిధులు రాలవు.. ఉద్యోగుల జీతాలూ రావు.. ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా తీసుకునే పరిస్థితి ఉండదు.. ఇదంతా ఏపీ ప్రభుత్వం చేసుకున్న స్వయంకృతాపరాధమేనా..? ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండానే ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు ఏం జరగబోతోందనే దానిపై చర్చోప చర్చలు నడుస్తున్నాయి. జగన్ సర్కారు తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నాయి. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకపోవటంతో ఖజానా నుంచి పైసా కూడా తీసుకోలేని దౌర్భగ్య పరిస్థితులు ఏర్పడేలా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహిరించిందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది..? జగన్ సర్కార్ వ్యూహం ఎందుకు బెడిసి కొట్టింది..? అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించాల్సిన ప్రభుత్వం తీరు ఇలాగేనా..? ప్రభుత్వం అంటే పట్టు విడుపులు ఉండాలి.. ప్రతి అంశంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.. పాలన గాడి తప్పకుండా చూసుకోవాలి.. కానీ, ఏపీలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. అందుకు శాసనమండలి సమావేశాలే ప్రత్యక్ష నిదర్శనం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుపెట్టుకుని, సీఆర్డీయే రద్దు, మూడు రాజధానుల బిల్లులను మళ్లీ మండలి ముందుకు తీసుకొచ్చి ప్రతిపక్షాల చేతిలో అభాసుపాలైంది.. రాష్ట్ర ప్రజలందరి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. శాసనమండలి నివరధిక వాయిదాతో ద్రవ్య వినిమయ బిల్లు త్రిశంకు స్వర్గంలో పడింది.. ఈ బిల్లుకు మండలి ఆమోదం లభించకపోవడంతో గందరగోళం నెలకొంది.
నవరత్నాలు అమలు చేయాలన్నా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, అంతెందుకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిన్న పనైనా ఖజానా నుంచే డబ్బు వెళుతుంది.. అయితే, ఈరోజు నుంచి ఖజానా నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకునే అవకాశం లేదు.. ఆ అవకాశాన్ని ప్రభుత్వమే చేజేతులా జారవిడుచుకుంది. విపక్షాలను కట్టడి చేయాలనుకుని ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా తన వేలితో తన కన్నే పొడుచుకుంది. ఖజానా నుంచి నిధులు విడుదల ప్రశ్నార్థకంగా మారింది.. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం లభించే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నుంచి నిధులు వెచ్చించే అవకాశం ఉండబోదంటున్నారు నిపుణులు. బడ్జెట్ ఆమోదం పొందకుండా ప్రభుత్వమే అడ్డుపడినట్లుగా భావించాల్సి ఉంటుందని మేధావులు అంటున్నారు.
రెండోరోజు మండలిలో 13 బిల్లులపై చర్చ జరిగి ఆమోదించాల్సి ఉంది. భోజన విరామం తర్వాత 9 బిల్లులకు ఎగువ సభ చర్చ జరిపి ఆమోదం తెలిపింది.. కానీ, రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు,ఎడ్యుకేషన్ అమెండ్‌మెంట్ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం తెలపాల్సిన సమయంలో వివాదం మొదలైంది. తర్వాత మరో రెండు బిల్లులు అసెంబ్లీ నుంచి రాగా, మొత్తం ఆరు బిల్లులకు మండలి ఆమోదించాల్సి ఉంది. ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీయే రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరపాలని పట్టుపట్టారు. కానీ, ముందు ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టాలని టీడీపీ సభ్యులు కోరినా అధికార పక్షం పట్టించుకోలేదు. ప్రభుత్వమే పంతానికి పోవడంతో ప్రతిపక్షం కూడా తన వ్యూహాన్ని అమలు చేసింది. ఫలితం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండానే మండలి నిరవధికంగా వాయిదా పడింది.
ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టాలని ఉదయం నుంచి తాము ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టకుండా మంత్రులే స్వయంగా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. ముందస్తు వ్యూహం మేరకే 18 మంది మంత్రులు శాసనమండలిలో తిష్ట వేసి ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. కేవలం బడ్జెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంలో మంత్రుల ఉద్దేశం ఏంటని టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.. బడ్జెట్ ఆమోదం పొందకుండా స్వయంగా అధికార పక్షమే అడ్డుకోవడం విడ్డూరమని మేధావులు సైతం విమర్శిస్తున్నారు.