ఏపీలో కర్నాటక మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో మద్యం రేట్లు పెరగడంతో.. పక్క రాష్ట్రం నుంచి భారీగా తరలిస్తున్నారు అక్రమార్కులు. దీంతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అటు ప్రజలు కర్నాటక మద్యానికి బానిసలవుతున్నారు. అనంతపురం జిల్లాలో కర్నాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గంలో కర్నాటక మద్యం తక్కువ ధరకే లభిస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో ఏపీలోకి భారీగా మద్యం రవాణా అవుతోంది. భారీగా పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా అడ్డదారుల్లో మద్యాన్ని తరలిస్తున్నారు. మే 16 నుంచి జూన్ 12 వరకు 80 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
అనంతపురం జిల్లాలో కర్నాటక మద్యం ఏరులై పారుతుంటే.. కర్నూలు జిల్లాలోకి తెలంగాణ మద్యం తరలివస్తోంది. సోదాల్లో భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లాలో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని తుంగభద్ర చెక్‌పోస్ట్ వద్ద సోదాలు నిర్వహించారు. పెద్దమొత్తంలో అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఐదుగురు అక్రమార్కులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. దాదాపు 25 వేల విలువ చేసే పలు రకాల బ్రాండ్లు, బీర్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.