ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలోనూ ఎదురుదెబ్బ..

Update: 2020-06-19 08:21 GMT

ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగించేందుకు ససేమిరా అంటున్న ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. రమేష్ కుమార్ పునర్ నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎస్ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్, నిమ్మగడ్డ తొలగింపుపై ఇప్పటికే విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు..ఎస్ఈసీగా రమేష్ కుమార్ ను మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే..ఎలక్షన్ కమిషన్ పదవిలో రమేష్ కుమార్ కొనసాగించే ప్రసక్తే లేదనే పంతంతో ఉన్న ప్రభుత్వం..హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కానీ, ఏపీ ప్రభుత్వం అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ పునర్‌ నియామకాన్ని సవాల్‌ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం... హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించటం ఇది రెండోసారి. దీంతో ఇదే అంశంపై ఇప్పటికే విచారణ జరిపి నోటీసులు ఇచ్చామన్న సీజేఐ, ఈ పిటీషన్‌పై కూడా నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు కొత్తగా దాఖలైన పిటిషన్లను గత పిటిషన్లతో ట్యాగ్‌ చేసింది. దీనిపై వచ్చే వారం విచారణ జరిగే అవకాశముంది.

SEC విషయంపై ఇప్పటికే ప్రభుత్వం ఓసారి సుప్రీం తలుపు తట్టింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఇందుకు సుప్రీం ధర్మాసనం ఒప్పుకోలేదు. SEC పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆర్డినెన్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు నమ్మదగ్గవిగా లేవని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేశాక.. 2 వారాల తర్వాత పూర్తిస్థాయిలో వాదనలు వింటామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే అంశంపై ఎన్నికల సంఘం కార్యదర్శి మళ్లీ పిటిషన్ వేశారు. స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు...రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

Similar News