ప్రభుత్వం ప్రశ్నించే గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తోంది: మాజీ న్యాయమూర్తి
పాలనలోని లోపాలను ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ నియామకంలో రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ప్రశ్నిస్తూ.. దానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్ 6 వ తేదీన టీవీ 5 లైవ్ షోలో చూపించినందుకు.. సీఐడీ అధికారులు తనపై 6 సెక్షన్ల కింద కేసులు పెట్టారని తెలిపారు. తనతో పాటు టీవీ5 ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, టీవీ 5 ప్రజెంటర్ మూర్తిపై కూడా కేసులు పెట్టారని చెప్పారు. ఈ కేసులకు సంబంధించిన విచారణ పేరుతో సీఐడీ అధికారులు మాటిమాటికీ నోటీసులు ఇస్తూ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. విచారణ పూర్తి పక్షపాత ధోరణిలో జరుగుతోందని.. ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమేనని శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు.