ఏపీ శాసనమండలిలో జరిగిందిదే..

Update: 2020-06-19 08:51 GMT

బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించకుండా శాసన మండలిని నిరవధిక వాయిదా వేయటమా? గతంలో ఎప్పుడు జరగని..చూడని ఘటన ఇది. అయితే..ఈ పాపం మాత్రం తమది కాదంటోంది అధికార పార్టీ. ద్రవ్యవినిమబిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుపడ్డారని ప్రచారం చేస్తోంది. అయితే..మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలు చేస్తున్న ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీలు కౌంటర్ అటాక్ ప్రారంభించారు. అంతేకాదు..బుధవారం రోజున శాసనమండలిలో మంత్రుల అసభ్య ప్రవర్తన, భూతులు తిట్టడం..తమ సభ్యులపై దాడికి ప్రయత్నించటంపై మండలి చైర్మన్ కు టీడీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు.

అసలు శాసన మండలిలో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి తాము కృషి చేస్తుంటే 18 మంత్రులు సభలో భూతులు మాట్లాడుతూ తమపై దాడి చేశారన్నది టీడీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము ఎక్కడా సభలో అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ను ఉపయోగించలేదన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే శాసనమండలి వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రులంతా లోకేష్‌ను టార్గెట్ చేశారని..ఆయనపై దాడి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీలు.

ద్రవ్యవినిమయ బిల్లు ముఖ్యమైనది కనుగ..ముందుగా ఆ బిల్లును ఆమోదించుకుందామని తామే కోరామని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. కానీ, కరోనా వంకతో సీఆర్డీఏ రద్దు బిల్లు, రాజధాని బిల్లును ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని వివరించారు.

సభ్యులు చెబుతున్న వివరాల ఆధారంగా మండలిలో పెద్ద గలాటే చోటు చేసుకున్నట్లు అర్ధం అవుతోంది. అయితే..ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగిందని అంటున్నారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. తొలి రోజు సమావేశంలో ఒక్క మంత్రి కూడా మండలికి రాలేదని..తర్వాతి రోజు మాత్రం ఏకంగా 18 మంత్రులు వచ్చి..తమపై దాడి చేశారని చెబుతున్నారాయన. గతంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని వివరించారు. అసలు మండలిలో ఏం జరిగింది? గొడవ ఎలా జరిగిందో? ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వివరించారు.

18 మంత్రుల అరాచకం అంతా లోకేష్ పై దాడి చేసేందుకేనని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. తమ స్థానాల దగ్గరికి వచ్చి దాడికి ప్రయత్నించి..తిరిగి తామే మంత్రులపై దాడికి ప్రయత్నించామని బుకాయిస్తున్నారంటూ అధికార పార్టీపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీలు. వెకిలి చేష్టలు..అసభ్యకరమైన మాటలతో మంత్రులు పెద్దల సభలో మునుపెన్నడూ లేనంత అరాచకం సృష్టించారని ఆరోపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. ద్రవ్యవినిమయ బిల్లును టీడీపీ అడ్డుకుందన్న ఆరోపణలను నిరూపించేందుకు వీడియోను రిలీజ్ చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.

Similar News