ప్రతి అంగుళం కాపాడుకునే సత్తా మనకుంది : ప్రధాని మోదీ

Update: 2020-06-20 08:18 GMT

గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చైనా ఆర్మీ పొట్టనపెట్టుకోవడంపై యావత్ భారత్ భగ్గుమంది. చైనా వస్తువులను నిషేధించాలని, డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని 20 రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి అంగుళం భూమిని కాపాడుకునే సత్తా మన కుందని మోదీ అన్నారు. చైనా బలగాలు మన భూభాగంలోకి చొరబడలేదని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం మీతోనే ఉందని సైన్యానికి మాటిస్తున్నానని మోదీ అన్నారు..

ఇంతవరకు చైనా జవాన్లను ఎవరూ అడ్డుకోలేకపోయినా.... మన సైనికులు అడ్డుకున్నారని మోదీ ప్రశంసించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. అత్యాధునిక ఆయుధ సంపత్తి మనకు ఉందని మోదీ చెప్పారు..

ఇక అఖిలపక్షం సమావేశంలో నేతలు ప్రధానికి పలు సూచనలు చేశారు. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నేతలు సూచించారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజనీతి కాదు రణనీతి కావాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు..

భారత దేశం యావత్తు ప్రధానితోనే ఉందనే సందేశం చైనాకు ఇవ్వాలని అకాలీదళ్ నేత సుఖ్‌భీర్ సింగ్ అన్నారు. ఇక చైనా వస్తువులపై 300 శాతం పన్ను విధించాలని సమాజ్ వాదీ పార్టీ నేతల రామ్ గోపాల్ యాదవ్ సూచించారు. ఇండియా మజ్‌భూత్‌గా ఉంది మజ్‌బూర్‌గా లేదని అన్నారు శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. భారత్ శాంతిని కోరుకుంటోంది... అలాగని బలహీనంగా ఉందని భావించొద్దన్నారు. తమ కుటుంబాలు, భద్రతా దళాలు అన్నీ మీతోనే ఉంటాయని ప్రధాని మోదీకి చెప్పారు ఉద్దవ్ థాకరే. చైనా పిరికిపంద దేశమని... అది చీకట్లో దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తోందని బీజేడీ అధినేత పినాకీ మిశ్రా అన్నారు..

చైనా తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మన మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు... మనమంతా ఒకటే అంటూ ప్రధాని మోదీకి మద్దతు తెలిపారు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితిష్ కుమార్. మనమంతా ఒకటే అనే సందేశాన్ని అఖిల పక్ష సమావేశమే చైనాకు ఇస్తోందన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. చైనాను టెలికాం, రైల్వే, విమానయాన రంగంలోకి ప్రవేశించుకుండా చూడాలని మమతా బెనర్జీ సూచించారు..

మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం గల్వాన్ ఘటనపై ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రభుత్వానికి ఎప్పుడు తెలిసింది? ప్రభుత్వం శాటిలైట్ చిత్రాలను సేకరించలేదా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు సంధించారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించడం ఆలస్యమైందని ఆమె అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను విపక్షాలకు ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ ఇవ్వాలని సోనియా గాంధీ సూచించారు..

గల్వాన్ ఘటనలో అమరులైన సైనికులకు అఖిలపక్ష సమావేశంలో నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. టిక్ టాక్‌ లాంటి చైనా యాప్‌లను బ్యాన్ చేయాలని కొందరు కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. యాప్‌లతో చైనా కోట్లాది రూపాయలను దోచుకుంటోందని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవలే అన్నారు.

Similar News