ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు వచ్చాయి. టీడీపీ క్యాండిడేట్ వర్ల రామయ్యకు 17 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నాలుగు ఓట్లు చెల్లలేదు. అనర్హత వేటుకు భయపడిన ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమ ఓటు చెల్లకుండా వేశారు. ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడు, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఐదుగురు బరిలో నిలవడంతో పోలింగ్ అనివార్యమైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని గెలుపొందారు. ఈ నలుగురికి 38 ఓట్ల చొప్పున పోలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 173 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది. 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆస్పత్రిలో ఉన్న టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్ ఓటింగ్‌కు హాజరు కాలేకపోయారు. ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన ఓటును వైసీపీకే వేశారు.. దీంతో వైసీపీ తరఫున మొత్తం 152 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో అభ్యర్థికి 38 మొదటి ప్రాధాన్యతా ఓట్లు రావడంతో...తొలి రౌండ్‌లోనే గెలుపు ఖాయమైపోయింది. ఈ నలుగురితో కలిపితే.. రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య ఆరుకు పెరిగింది.
రాజ్యసభ ఎన్నికల్లో మొదటి నుంచి అందరి దృష్టి ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపైనే ఉంది.. వీళ్లు ఎవరికి ఓటు వేస్తారు? ఎలా వ్యవహరిస్తారు అన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. అయితే రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం అనర్హత వేటుకు భయపడ్డారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వెస్తే అనర్హత వేటు ఖాయమన్న భయంతో ఎవరికీ చెల్లకుండా టిక్‌లు పెట్టారు. దీంతో ఈ మూడు ఓట్లు చెల్లవని ప్రకటించారు రిటర్నింగ్ అధికారులు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశారో చూపించాలన్న నిబంధన ఉంది. దీంతో ఈ ముగ్గురు 1 అని సంఖ్య వేయడానికి బదులుగా అడ్డగీత పెట్టారు. ఈ మూడింటితో పాటు చెల్లకుండా పోయిన మరో ఓటు కూడా టీడీపీ ఎమ్మెల్యేదేనని తేలింది. ఈ నాలుగు చెల్లని ఓట్లతోపాటు...అచ్చెన్నాయుడు, అనగాని ఓటింగ్‌కు హాజరు కాకపోవడంతో..టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే పోలయ్యాయి
ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలైంది. టీడీపీ తరపున బాలకృష్ణ మొదటి ఓటు వేశారు..వైసీపీ నుంచి సీఎం జగన్ తొలి ఓటేశారు..సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.. ఐదు గంటలకు కౌంటింగ్ మొదలైంది. 6 గంటలకు ఫలితాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 36 స్థానాలకు అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మిగిలిన 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు..మార్చి 26నే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు.