ఎలాంటి అప్పులేని సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఎలా సాధ్యం అంటే..

Update: 2020-06-20 08:39 GMT

ఎలాంటి అప్పులేని సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆవిర్భవించింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీ రుణరహితంగా మారడం అత్యంత అరుదైన విషయం. 2021 మార్చి31 నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా చేస్తామని వాటాదారులకు ఇచ్చిన మాట నిలెబెట్టుకున్నారు ముఖేష్‌ అంబానీ. వాటాదారులు, భాగస్వాముల అంచనాలను మించి పనితీరు కనబర్చడం రిలయన్స్‌ డీఎన్‌ఏలోనే ఉందన్నారాయన. గత కొన్ని వారాలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53 వేల కోట్లను సమీకరించింది. మరోపక్క జియో డిజిటల్‌ వ్యాపారంలోకి పెట్టుబడుల రూపంలో రూ.1.16 లక్షల కోట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ కారణంగా రిలయన్స్‌ వేగంగా తన మాటను నిలబెట్టుకోగలింది..

రిలయన్స్‌కు రూ.కోటి 61 వేల 35ల నికర అప్పు ఉండేది. దీన్ని 2021 మార్చి 31 నాటికి చెల్లించాలని టార్గెట్‌ పెట్టుకుంది. దీనికోసం చాలా వేగంగా రైట్స్‌ ఇష్యూస్‌, వాటాల విక్రయం చేపట్టింది. ఈ డీల్స్‌తో రిలయన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఒక రకంగా భారత కార్పొరేట్‌ శక్తిని ప్రపంచానికి తెలియ జేసినట్లైంది. కరోనాతో లాక్‌డౌన్‌లు విధించిన సమయంలో ఈ డీల్స్‌ జరిగాయి. ముందుగా రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూను జారీ చేసింది. ఇది భారత కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్దది. ఇది 1.59రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. గత పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా నాన్‌ ఫైనాన్షియల్‌ సంస్థ జారీ చేసిన అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ కూడా ఇదే.

రిలయన్స్‌ జియోలో మొత్తం 24.70 శాతం వాటాలను విక్రయించారు. మొత్తం 11 డీల్స్ చేసుకొన్నారు. ఏప్రిల్‌ 22 మొదలు తొమ్మిది వారాల్లో రూ.1,15,693.95 కోట్లను పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చారు. ఈ 11 డీల్స్‌ కాకుండా ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న మరో డీల్‌లో 9.99 శాతం వాటాను విక్రయించి రూ.43,573.62 కోట్లను తీసుకొచ్చారు. విస్తా, కేకేఆర్‌, సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లతో డీల్స్‌ నుంచి రూ.11,367 కోట్లు లభించాయి. మొత్తానికి రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌ నికర రుణ రహిత సంస్థగా మారడం గర్వకారణంగా ఉందన్నారు ముఖేష్‌ అంబానీ. రిలయన్స్‌‌ స్వర్ణయుగంలో ఉందని నేను చెప్పగలను. సంస్థ వ్యవస్థాపకులైన ధీరుభాయ్‌ అంబానీ కలలను సాకారం చేసేలా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకొంటుందన్నారు ముఖేష్‌.

Similar News