కరోనా వైరస్ వ్యాక్సిన్ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలితాన్నిస్తున్నాయి. తాజాగా సిప్లా కంపెనీ ఇందుకోసం మందును తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సిప్రెమీ పేరుతో ఈ మందును తీసుకు వచ్చేందుకు DCGI అనుమతి ఇచ్చింది. హెటిరో ఫార్మా ప్రయోగాలు చేసినట్టే రెమ్‌డెసివిర్‌తోనే సిప్లా కూడా పరీక్షలు చేసి.. తాజా ఔషధాన్ని తయారు చేసింది. ఐతే.. ఈ సిప్రెమీని అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల సూచన మేరకే వాడాలని ఔషధ నియంత్రణ మండలి సూచించింది.
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స విషయంలో గ్లెన్‌మార్క్ తయారు చేసిన ఫాబిఫ్లూ ట్యాబెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన పేషెంట్లు మొదటి, రెండో దశల్లో వాడితేనే ఫలితం చూపిస్తుంది. అదే ఇప్పుడు సిప్లా తెస్తున్న సిప్రెమి ఇంజెక్షన్ల ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న రోగులు కూడా కోలుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న యాటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌కు జనరిక్ వెర్షన్‌గా దీన్ని తయారు చేశామని సిప్లా కంపెనీ చెప్తోంది. గ్లెన్‌మార్క్ ఫాబిఫ్లూ, సిప్లా సెప్రిమీ తరహాలోనే హెటిరో కూడా ఇప్పటికే ఒక డ్రగ్‌ను కోవిఫర్ పేరుతో తీసుకొచ్చింది. మొత్తంగా ఫార్మా కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు ఒక్కొక్కటిగా కాస్త ఫలితాలు ఇస్తుండడంతో త్వరలోనే పూర్తి స్థాయి వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశాలు మెరుగుపడుతున్నాయి.