కేంద్ర ప్రభుత్వంతో సహా 'కేసీఆర్' ని చూసి నేర్చుకోవాలి: కాంగ్రెస్ నేత సింఘ్వి
మాటంటే మాటే. మాట మీద నిలబడే నాయకుడంటే కేసీఆర్ అనేంతగా కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు. అన్నట్టుగానే వారం తిరక్కుండానే స్వయంగా కల్నల్ సంతోష్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సంతోషిని, తల్లిని, పిల్లలను ఆప్యాయంగా పలకరించి రూ.5 కోట్ల చెక్కుని అందించారు. ఇళ్ల స్థలం పట్టాని, సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఇది చాలా హర్షించదగిన విషయం అని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి అన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించాలని సంఘ్వీ అభిప్రాయపడ్డారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ సరిహద్దుల్లో అమరుడైన సంతోష్ కుటుంబాన్ని ఆదుకున్న తెలంగాణ సీఎం తీరును ఆయన ప్రశంసించారు. కాగా, ఈస్టన్ లడఖ్ లోని గాల్వన్ లోయలో ఈనెల 15వ తేదీన జరిగిన సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. దొంగచాటుగా చైనా సైనికులు జరిపిన దాడిలో వారంతా ప్రాణాలు కోల్పోయారు.