ప్రకాశం జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. ఊహించనిస్థాయిలో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ తొలినాటి పరిస్థితి ఏర్పడింది. వైరస్ నిరోధానిక అప్పట్లో ప్రభుత్వం కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసింది. మళ్లీ ఇప్పుడు జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ఏదో ఒక స్థాయిలో అంక్షలు విధిస్తోంది ప్రభుత్వం. చీరాలలో ఇప్పటికే పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉంది. ఒంగోలులో ఇప్పటికే రెండు రోజుల నుంచి సంపూర్ణంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
లాక్‌డౌన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో జనసంచారం పూర్తిగా బంద్ అయ్యింది. వాహనాల రాకపోకలపై నియంత్రణ పెరగ్గా.. దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో గత పది రోజులుగా కరోనా ఉధృతి అధికంగా ఉంది. లాక్‌డౌన్ సడలింపులకు ముందు వందలోపే పాజిటివ్ కేసులు ఉంటే.. ఇప్పటికే ఆ సంఖ్య మూడు వందలను దాటింది. ముఖ్యంగా ఒంగోలు, చీరాల నగరాల్లో నమోదవుతున్న కేసులు ఆందోళన పెంచుతున్నాయి.