తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇంతకాలం ఒక్క కేసు కూడా నమోదవలేదని సంబరపడుతున్న సమయంలో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 99 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో అత్యధికంగా రాయవరం మండలం చెల్లూరులో 22 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ గ్రామంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 101కి చేరుకుంది. కాజులూరు మండలం ఆర్యవటంలో సోమవారం ఎనిమిది పాజిటివ్ లు రాగా వారిని కలిసిన వారిలో మరి కొంత మందికి పాజిటివ్ అని తేలింది. ఇటీవల ఓ గర్భిణీ ప్రసవానంతరం వైరస్ బారిన పడింది. ఈమె ద్వారా 21 మందికి వైరస్ సంక్రమించింది. కాగా, కాకినాడ ఏపీఎస్సీలో ఏడుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. రాజమహేంద్రవరంలో పది కేసులు, అన్నవరం ఆంధ్రాబ్యాంకులో రెండు కేసులు నమోదై మొత్తం కలిపి జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య 962కు చేరుకుంది.