అనుమానం పెనుభూతం అంటారు.. ఒక్కోసారి నిజం కావచ్చేమో కానీ చాలా సార్లు అనుమానించక తప్పని పరిస్థితులు. రోజులు అలా ఉన్నాయి. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉంటేనే ఏదో ఒక రూపంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఆ చిన్న ఫోన్ చాలు పరిస్థితులు తారుమారు కావడానికి. ఆన్ లైన్ క్లాసులంటూ ప్రతి ఇంట్లో పిల్లలు ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. వాళ్లకి ఎంత వరకు అర్థమవుతుందో.. మాస్టర్లు ఏం చెబుతున్నారో తల్లి దండ్రులు ఓ కంట కనిపెట్టకపోతే చాలా కష్టం అంటున్నారు నిపుణులు.
పాఠాలు, అందులో వచ్చే డౌట్లకు ఎప్పుడూ మాస్టారితో చాటింగ్ చేస్తుంటే ఓ కన్ను అటు వేసి ఉంచాలి. నిజంగానే డౌట్లు అడుగుతున్నారా లేక మరింకేదైనా మాట్లాడుతున్నారా అనేది ఆలోచించాలి. అందుకోసం పిల్లలతో కొంత సమయం గడపాలి. వాళ్లేం నేర్చుకుంటున్నారో తెలుసుకోవాలి. మాస్టారితో మీరూ మాట్లాడుతుంటే అతడి స్వభావం ఏమిటో కాస్తైనా అవగాహనకు వస్తుంది. లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది అని అంటున్నారు మానసిక వైద్యులు.
అలా అని అదేపనిగా అనుమానం వ్యక్తం చేయకుండా చూడాలంటున్నారు. హద్దులు దాటుతున్న ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోకపోతే మేనేజ్ మెంట్ కు ఫిర్యాదు చేస్తామని సున్నితంగా హెచ్చరించాలి. మరో పక్క పిల్లలకు కూడా మంచి చెడు తెలియజేయాలి. ఉపాధ్యాయులు చదువుకు సంబంధించిన విషయాలు కాకుండా వ్యక్తిగత అంశాలు మాట్లాడుతుంటే వెంటనే పిల్లలు మీకు చెప్పేలా చూసుకోమంటున్నారు.