మనిషి బ్రతికి ఉన్నప్పుడు బాగోగులు కనుక్కునే తీరిక ఎవరికీ ఉండదు. కానీ మరణించిన తరువాత ఏం కోల్పోయామో తెలుస్తుంది.. ఎందుకు పట్టించుకోలేదో అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తుంది. సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఎవరనేది ఆయనకు మాత్రమే తెలుసు.. ఆ రహస్యం అతడితోనే వెళ్లిపోయింది. కానీ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్టులు అతడికి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నాయి అని సుశాంత్ తో పాటు సూపర్ హిట్ మూవీ ఎంఎస్ ధోనీలో నటించిన భూమిక ఆవేదన వ్యక్తం చేశారు.
సుశాంత్ మరణం తననెంతో కలచి వేసిందని, అనంతరం బాలీవుడ్ లోని బంధుప్రీతిని విమర్శిస్తూ తారాస్థాయిలో విరుచుకుపడుతున్న వారిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. సుశాంత్ మరణం వల్ల బాధపడుతున్న వారంతా భగవంతుడిని ప్రార్థించండి. మీ గురించి, మీ చుట్టూ ఉన్నవారి గురించి పట్టించుకోండి. సుశాంత్ మరణానికి కారణం ఫలానా వారు అని విమర్శించడం తగదు.. బంధాలా, బంధుప్రీతా అనే విషయాల గురించి చర్చించుకుంటున్నారు. అందరికీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను.
మరణించిన వారి ఆత్మ శాంతించేలా ప్రవర్తించండి. విమర్శించే సమయాన్ని మరో మంచి పనికి ఉపయోగించండి. పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోండి. ఈ దేశంలో చదువులేని నిరక్ష్యరాసులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి మనచేతనైనంత సాయం చేద్దాం. ఎదుటివారిని విమర్శించొద్దు.. ఒకరినొకరు గౌరవించుకుందాం. చిత్ర పరిశ్రమే దీనికి ఒక పరిష్కారం చూపిస్తుందని ఆశిద్దాం. దయచేసి పబ్లిక్ లో చర్చలు చేయకండి అని భూమిక ఆవేదనతో పోస్ట్ పెట్టారు.