అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలి : న్యాయమూర్తి

Update: 2020-06-25 08:26 GMT

గుంటూరు జీజీహెచ్‌ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్‌ అధికారులు హైడ్రామాకు తెరలేపారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలిసి టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో... డిశ్చార్జిపై ఆస్పత్రి అధికారులు వెనక్కి తగ్గారు.

ESI కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయన ప్రస్తుతం పడకపై ఏస్థితిలో ఉన్నారో అదే స్థితిలో ప్రశ్నించాలని, న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగాలని పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తెప్పించుకొని పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల్లో ఆయనను డిశ్ఛార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. వీటిని పరిశీలించిన కోర్టు అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే ప్రశ్నించాలన్న నిబంధనతో కస్టడీకి ఇచ్చింది. అయితే బుధవారం అర్ధరాత్రికే పరిణామాలు మారిపోయాయి. ఆసుపత్రి వర్గాలు అచ్చెన్నాయుణ్ని డిశ్చార్జ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.. టీడీపీ నేతల ఆందోళనతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.

Similar News