పిన్న వయసులో సంసద్ రత్నఅవార్డుకు ఎంపికైన సిక్కోలు ముద్దుబిడ్డ

Update: 2020-06-24 22:01 GMT

టీడీపీ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌ నాయుడు సంస‌ద్ ర‌త్న అవార్డు-2020కి ఎంపిక‌య్యారు. అతి పిన్న వ‌య‌స్సులో ఈ అవార్డుకు ఎంపికైన ఎంపీగా రికార్డు సృష్టించారు. పార్లమెంట్ సభ్యునిగా క‌న‌ప‌రిచిన అత్యుత్తమ ప‌నితీరు, ప్రజాసమస్యల ప‌రిష్కారంలో చూపిస్తున్న చొర‌వ‌ని గుర్తించి జ్యూరీ కమిటీ ఈ ప్రత్యేక అవార్డు ప్రకటించింది. దేశ‌వ్యాప్తంగా 8మంది లోక్‌ సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలను సంస‌ద్ ర‌త్న అవార్డుల‌కు ఎంపిక చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జ‌రిగింది.

సంసద్‌రత్న అవార్డు రావడంపై రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ ప్రజలు, కింజ‌రాపు కుటుంబ వార‌సునిగా ప్రజాసేవలో ఉన్న త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాన‌ని అన్నారు. రాజ‌కీయ ప్రముఖులు శశి థరూర్, సుప్రియ సులే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా వుంద‌న్నారు. శ్రీకాకుళం ఎంపీగా తాను చేసిన సేవ‌ల‌ను గుర్తించి మళ్లీ ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకే ఈ అవార్డు అంకితం అని పేర్కొన్నారు. సంసద్ రత్న పురస్కారంతో త‌న బాధ్యత మ‌రింత పెరిగింద‌ని చెప్పారు.

మాజీ రాష్ట్రప‌తి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010లో సంస‌ద్ రత్న అవార్డులు ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వైర‌స్ వ్యాప్తి త‌గ్గి, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించిన త‌రువాత అవార్డుల ప్రదానం ఉంటుందని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంస‌ద్ రత్న అవార్డుల కమిటీ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.

Similar News