ఈఎస్‌ఐ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.. కోర్టు ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్‌లోనే ఆయన్ను విచారిస్తున్నారు.. సాయంత్రం సమయంలో ఆస్పత్రికి వెళ్లిన అధికారులు జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడిని విచారించారు. దాదాపు మూడు గంటలకుపైగా విచారణ సాగింది. ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి, సూర్యనారాయణరెడ్డి నేతృత్వంలోని టీమ్ అచ్చెన్నాయుడిని విచారించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే విచారించాలని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ సాయంత్రం తర్వాత విచారణకు వెళ్లడంపై టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు, ఎల్లుండి కూడా అచ్చెన్నాయుడిని విచారించనున్నారు ఏసీబీ అధికారులు.
ఆరోగ్యం బాగోలేకపోయినా అచ్చెన్నాయుడిని రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టి విచారించారని ఆయన తరపు న్యాయవాది హరిబాబు అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టి అధికారులు చేసిందేమీ లేదన్నారు. ఎవరికీ కనీస సమాచారం ఇవ్వకుండా సాయంత్రం నాలుగున్నరకు ఏసీబీ అధికారులు వచ్చారని హెల్త్ కండీషన్ బాగోలేకపోయినా డిశ్చార్జ్ రిపోర్టు ఇచ్చారని ఆయన అన్నారు. టెలీ హెల్త్ సర్వీసులకు సంబంధించి ప్రశ్నలు అడిగారని, ఈఎస్‌ఐకి సంబంధించిన ఏదీ మంత్రి చేతుల్లో ఉండదన్నారు. కేవలం ఇతర రాష్ట్రాల్లో జరిగిన కొనుగోళ్లను పరిశీలించమనే ఆయన లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు.