ఏపీలో పొలిటికల్ టెర్రరిజమ్ పరాకాష్టకు చేరిందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. విపక్షాలపై కొత్త తరహాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి.. వాళ్ల కంట్రోల్‌లో ఉంచుకునేలా చేసేందుకు కుట్ర పన్నారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను వారి ఐసోలేషన్‌లోకి తీసుకున్నాక... కోవిడ్ ఎక్కించేందుకు ప్లాన్ చేశారని దీపక్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో ఈ స్థాయికి రాజకీయాలు దిగజారుతున్నాయని దీపక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్‌గా తేలి... హైదరాబాద్‌లోని రెండు ల్యాబ్స్‌లోనూ దీపక్ రెడ్డికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అంటే ఏపీ ప్రభుత్వానికి కరోనా టెస్టులు పిల్లల ఆటలుగా మారిపోయాయని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే.. యంత్రాంగం కరోనా టెస్టులను ఆషామాషీగా నిర్వహిస్తోందన్న అనుమానం వస్తోందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందని క్వారంటైన్‌కు రమ్మని హడావుడి చేశారని ట్వీట్ చేశారు. ఒకసారి పాజిటివ్ వచ్చాక... హైదరాబాద్‌లో రెండు సార్లు టెస్టులు చేస్తే నెగెటివ్ వచ్చిందన్నారు.
ఓ ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే.. ప్రజలతో ఇంకెన్ని ఆటలాడుతారని ప్రశ్నించారు నారా లోకేష్. ప్రజల ప్రాణాలకు సంబంధించి కరోన పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యమని లోకేష్ ట్వీట్ చేశారు. పాజిటివ్ అని నిర్ధారణ చేసుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని క్వారంటైన్‌లో పెట్టడానికి జరిగిన హడావుడి చూస్తుంటే.. ఇంకేదైనా కుట్ర చేసిందా ప్రభుత్వం అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందేనని లోకేష్ ట్వీట్ చేశారు.