దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం వరకు.. 24 గంటల వ్యవధిలోనే 17,296 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ముఖ్యంగా వారం రోజులుగా ప్రతి రోజూ 14,000లకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
జూన్ 1 నుంచి 26వ తేదీ వరకు నమోదైన కేసులను లెక్కిస్తే ఆ సంఖ్య 2,99,866గా తేలింది. దీంతో తొలి నుంచి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి బారిన పడి 407 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 15,301కి పెరిగింది. కరోనా బారిన పడిన వారిలో ఇప్పటివరకు 2,85,636 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 58.24 శాతంగా నమోదైంది.