భారత్‌లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల నుంచి 5 లక్షలకు పెరగడం గమనార్హం. గడచిన 24 గంటల్లోనే 18,552 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,08,953కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
కరోనా మహమ్మారి బారిన పడి గడచిన 24 గంటల్లో 384 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 15,685కి పెరిగింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 213 దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. రష్యా మూడోస్థానంలో ఉంది.