కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జులై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఝార్ఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం హేమంత్ తెలిపారు.
లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, మతపరమైన కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు హేమంత్ ప్రకటించారు. రాష్ట్రంలోని స్కూల్లు, కాలేజ్‌లు, ఇతర విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్ లు, ఆడిటోరియాలను మూసివేయాలని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లు, ధర్మశాలలు, లాడ్జీలు, రెస్టారెంట్ లను మూసివేశారు. లాక్ డౌన్ సందర్భంగా రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై రాకపోకలను బంద్ చేశారు.
ఝార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,262 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుండి 1507 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ సడలింపులు ఇస్తే భారీగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.