పెళ్లిళ్లకంటూ ఓ సీజన్ ఉంటుంది. కానీ కరోనాకి సీజనే లేకుండా పోయింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అటాక్ చేస్తానంటూ పెళ్లి పందిట్లోనే కాచుక్కూర్చుంటోంది. పెళ్లి చేసుకున్న వరుడు, వధువు, తండ్రి, తాత ఇలా వరసబెట్టి 16 మందికి కరోనా అంటుకుంది. అసలే ఆ వివాహ వేడుకలకు వెయ్యి మంది హాజరయ్యారు. ఇంకెతమందికి కరోనా వచ్చి ఉంటుందో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాజస్థాన్ బిల్వాడా జిల్లా భడాడా ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త జూన్ 13న తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాడు.
పెళ్లికి ముందు అధికారుల దగ్గరుకు వెళ్లి పర్మిషన్ కూడా తీసుకున్నారు.. 50 మంది అతిధుల్నే పిలుస్తాను.. అందరికీ మాస్కులు, శానిటైజర్లు సప్లై చేస్తాను.. భౌతిక దూరం పాటించేలా చూస్తాను అని అనుమతి తీసుకున్నారు. అందులో ఒక్కటీ పాటించకుండా ఏకంగా వెయ్యి మందిని ఆహ్వానించాడు అబ్బాయి పెళ్లికి. ఆ సమయంలో అందరూ కరోనా ముచ్చటే మర్చిపోయారు. వేడుకల అనంతరం కొందరు అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి వెళ్లారు. జూన్ 19న కరోనా టెస్ట్ చేస్తే వధువు, వరుడు, తండ్రి, తాతతో పాటు మరో 16 మందికి పాజిటివ్ అని వచ్చింది.
చికిత్స చేసినా లాభం లేక వైరస్ తో వరుడి తాత మృతి చెందారు. మరో 58 మంది క్వారంటైన్ లో ఉన్నారు. ఈ ఘటనపై ఆగ్రహం చెందిన జిల్లా కలెక్టర్ వరుడి కుటుంబానికి భారీ జరిమానా రూ.6.26 లక్షలు విధించారు. దీంతో పాటు వైరస్ సోకిన వారికి చికిత్సకు సంబంధించిన ఖర్చును భరించాలని, హోం క్వారంటైన్ ఉన్న వారందరికి నిత్యావసరాలు సరఫరా చేయాలని ఆదేశించారు. భద్రతా ప్రోటోకాల్ ను ఉల్లంఘించినందుకు గాను వరుడి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.