శుక్రవారం ముంబైతో సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ మళ్లించాల్సి వచ్చింది. చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇక శనివారం కూడా మంబైలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ముంబై మహానగరం లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, పాల్‌ఘర్, థానేలలో శనివారం కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.