పనికిరాని జీవితం..: సాయి పల్లవి ఆవేదన

Update: 2020-07-03 19:43 GMT

ఏంటీ దారుణాలు.. మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపడానికి వాళ్లకి చేతులు ఎలా వచ్చాయి అని నటి సాయి పల్లవి తూత్తుకుడి జిల్లాలో జరిగిన ఘటన గురించి ఆవేదన చెందుతూ వరుస ట్వీట్లు పెడుతున్నారు. రెండ్రోజుల క్రితం తప్పి పోయిన బాలిక అత్యాచారానికి గురై దారుణంగా హత్యగావింపబడిన సంఘటనపై సెలబ్రెటీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇతరులకు సాయం చేయడానికి ఇచ్చిన శక్తిని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నాము. ఈ ఘటనతో మానవ జాతిపై ఉన్న ఆశ దిగజారుతోంది. గడుస్తున్న ప్రతి రోజు ప్రకృతి మనకో పాఠం నేర్పుతోంది. కుళ్లి పోయిన ఈ జాతిని శుభ్రం చేయాలని గుర్తు చేస్తోంది. ఇలాంటి దారుణమైన అన్యాయాలు చూడడానికే మనం జీవితాన్ని గడుపుతున్నామా.. పనికి రాని జీవితం.. చిన్నారులను కాపాడుకోలేకపోతున్నాం. మరో బిడ్డను ఈ రాక్షస సమాజంలోకి తీసుకుని వచ్చే అర్హతను కోల్పోయాం. ఓ దారుణమైన ఘటన జరిగినప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో స్పందించే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. మరి మనం గమనించని, మీడియా దృష్టికి రాని సంఘటనలు, పట్టించుకోని దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో.. వాటి విషయంలో ఏం చేద్దాం అని సాయి పల్లవి ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడు పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామానికి చెందిన ఏడేళ్ల జనప్రియ రెండో తరగతి చదువుతోంది. జూలై ఒకటో తేదీ బుధవారం సాయింత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం ముళ్ల పొదల్లో ఉన్నట్లు గుర్తించారు. పోస్ట్‌మార్టంలో చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో తమిళనాడు అట్టుడికి పోతోంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులకు ఎలాంటి శిక్ష వేసినా ఆవేశం చల్లారదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Similar News