అమరావతి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. వివిధ దేశాల్లోని తెలుగువారంతా రైతులకు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. వివిధ రూపాల్లో తమ వ్యతిరేకతను తెలియజేశారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ కదం తొక్కారు. అందరం ఒకటై.. అమరావతికి తోడై నినదిద్దాం అంటూ గర్జించారు. అమరావతి పోరాటానికి ప్రవాసాంధ్రులు సంకీభావం తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి వివిధ దేశాల్లో తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
న్యూజెర్సీ , ఫ్లోరిడా, డెట్రాయిట్, మినియా పోలీస్, డల్లాస్ , కాలిఫోర్నియాలో మేముసైతం అంటూ కదం తొక్కారు. అలాగే కెనడా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్, కువైట్, ఐర్లాండ్, జర్మనీ లో నివసిస్తున్న తెలుగువారంతా అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలిపారు. రెండువందల రోజులుగా అమరావతివాసులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు అంశంపై ప్రధాని కలుగజేసుకోవాలని కోరారు.