జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే పలు రకాల వ్యాధులు..

Update: 2020-07-05 16:27 GMT

పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధం.. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కూడా ఇవ్వలేరని నిరూపిస్తుంటారు మానవులు. అయితే ప్రేమగా పెంచుకునే ఆ పెట్స్ నుంచే చాలా రకాల వైరస్ లు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జంతువుల మీద ఆధాపడుతుంటాడు. వాటి నుంచి కొన్ని రకాల వ్యాధులు మనుషులకు తెలియకుండానే సంక్రమిస్తున్నాయి. వైద్య విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రకాల జబ్బులకు వైద్యం అందని పరిస్థితి ఇప్పటికీ నెలకొని ఉంది. స్వైన్ ప్లూ, బర్డ్ ప్లూ, రేబిస్, హెచ్ ఐవీ, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇవన్నీ జంతువుల నుంచి మానవులకు సంక్రమించినవే. మనుషులకు వచ్చే ప్రతి మూడు జబ్బుల్లో రెండు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జంతువుల నుంచి సంక్రమించే కొన్ని వ్యాధుల గురించి తెలుసుకుందాం..

జంతువుల నుంచి మనుషులకు 190 రకాల వ్యాధులు సోకుతాయని నిపుణుల పరిశోధనల్లో తేలింది.

జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.

కుక్క కాటు ద్వారా రేబిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి ముందు జాగ్రత్త మినహా వ్యాధి సోకిన తర్వాత వైద్యం లేదు.

పందుల ద్వారా మెదడు వాపు వ్యాధి, గొర్రెల ద్వారా టీబీ వస్తుంది.

ఇక అనారోగ్యంగా ఉన్న మేకను చంపి తినడం వల్ల ఆంత్రాక్స్ సోకింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అడవి గబ్బిలాల ద్వారా నిఫా వైరస్ బయటపడింది కేరళలో. బర్డ్ ప్లూ వ్యాధి కోళ్ల ద్వారా ఇతర పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నివారణకు ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనలేదు. వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచే మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఆంత్రాక్స్ వ్యాధి.. బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులకు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైంది.

కుక్కకాటుకు గురైతే వీలైనంత త్వరగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. రేబిస్ సోకిన వ్యక్తి ద్వారా కూడా ఇతరులకు వ్యాధి సోకే అవకాశం ఉంది. నిజానికి రేబిస్ వ్యాధి రాబ్ డో అనే వైరస్ వల్ల సోకుంతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఉంటుంది. చనిపోయిన ఆ జంతువుల కళేబరాలను కుక్కలు తినడం వల్ల వాటికి ఈ వైరస్ సోకుతుంది. కుక్కలను మనుషులను కరవడం వల్ల వారికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

రేబిస్ వ్యాధి కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా 35వేల మంది మరణిస్తున్నారు. పెట్స్ తో అనుబంధం ఉన్నవారు, డాక్టర్లు సైతం ఈ రేబిస్ వ్యాక్సిన్ ముందు జాగ్రత్త కొరకు వేయించుకోవాల్సి ఉంటుంది. రేబిస్ వ్యాధి పశువులకు సోకితే అవి 11 రోజుల్లో మరణిస్తాయి. మనుషుల్లో అయితే పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పని చేయకుండా పోయి మరణిస్తారు. రేబిస్ వ్యాధి సోకిన కుక్క గానీ, పశువులు గానీ మరణిస్తే వాటిని పూడ్చకుండా దహనం చేయాలి. లూయీపాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి వ్యాధి నిరోధక టీకా ఇవ్వడం ద్వారా రేబిస్ రాకుండా కాపాడగలిగారు.

Similar News