జులై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే అధికారులు కాగితాలపై చూపిస్తున్న లెక్కల ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేది సమాధుల్లో అని తేలింది. ఎలాగోలా ఇళ్లపట్టాల పంపిణి కార్యక్రమాన్ని మమ అనిపించేందుకు గుంతలు, పొలంగట్లు సమాధుల్లో సర్వే చేసి వాటిల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ సమాధుల మధ్య ఇళ్ల పట్టాలు ఇస్తారా అంటూ లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. తమ పూర్వీకుల సమాధుల్లో ఇళ్ల పట్టాలు ఎలా కేటాయిస్తారని గ్రామంలోని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎవరైనా తమ విధులకు అడ్డుతగిలితే వారిపై కేసులు పెడతామని విఆర్ఓ బెదిరిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.