వంటింట్లో నాగుపాముల ఫ్యామిలీ.. ఏకంగా 14 పిల్లలు

Update: 2020-07-06 13:53 GMT

ఒక్క పాముని చూడాలంటేనే ఒళ్లు జలదరిస్తుంది. మరి ఏకంగా 14 నాగుపాము పిల్లలు ఒక్క చోటే దర్శనమిస్తే గుండె ఆగిపోదూ. భువనేశ్వర్ లోని జాజ్ పూర్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోని వంటగదిలో ఈ పాము పిల్లలు దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన పద్మ లోచన మహంది.. ఇంట్లో నాగుపాము తిరుగుతుండడాన్ని గమనించింది. దాన్ని చూసి ఒక్క ఉదుటన బయటకు పరుగు తీసి చుట్టుపక్కల వాళ్లను పిలిచి చెప్పింది. వారు వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించారు. వెంటనే హెల్ప్ లైన్ సభ్యులు వచ్చి పద్మలోచన ఇంట్లో కలియతిరిగి పాము ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకున్నారు.

కిచెన్ లో గ్యాస్ సిలిండర్ కింద చిన్న రంద్రం ఉండడటాన్ని గమనించారు. అక్కడి నుంచే పాము వచ్చి వుంటుందని తెలుసుకుని తవ్వడం ప్రారంభించారు. అంతలో అందులో నుంచి ఒక్కొక్కటిగా మొత్తం 14 పాము పిల్లలు బయటపడ్డాయి. అన్ని పాముల చూసి షాకయిన ఇంటి యజమాని.. ఇన్ని రోజులు ఇన్ని పాముల మధ్యలో మనం ఉన్నామా అని గుడ్లు తేలేశారు. 14 పాము పిల్లల్ని పట్టుకుని అడవిలో వదిలేశారు కానీ పెద్ద పాము దొరకలేదు. అది ఎక్కడ దాక్కుందో అర్దం కాకుండా ఉంది. అది దొరికే వరకు ఇంట్లో ఉండాలంటేనే భయపడుతున్నారు కుటుంబసభ్యులు.

Similar News