కేరళ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎపిడెమిక్ కరోనా వైరస్ డిసీజ్ (కోవిడ్ -19) 2020 రెగ్యులేషన్స్.. జూలై 2021 వరకు రాష్ట్రంలో అమల్లో ఉంటాయని ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిబంధనలు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం ప్రకటించిన దాని నిబంధనల ప్రకారం.. వచ్చే సంవత్సరం వరకూ ఫేస్ కవర్లు / మాస్కులు ధరించడం తప్పనిసరి.. అలాగే సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది.
అధికారుల అనుమతి లేకుండా సామూహిక సమావేశాలు లేదా ఊరేగింపులు నిర్వహించకూడదు. అయితే సరైన సామాజిక దూరంతో గరిష్టంగా 10 మందికి మాత్రమే అనుమతించబడుతుంది. వాణిజ్య సంస్థలలో కస్టమర్ల సంఖ్య 20 మాత్రమే ఉండాలి.. అలాగే వినియోగదారుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు లేదా పేవ్‌మెంట్లలో ఉమ్మివేయడం నిషేధం కొనసాగుతుంది. వివాహాలకు 50 మంది వరకు, అంత్యక్రియలకు 20 మంది హాజరుకావడానికి అనుమతి ఉంది.