ముగ్గురు మహిళలు నదిలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. కొట్టుకుపోయిన మహిళల కోసం గాలింపు చేపట్టింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్ శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలవల్ల నైనిటాల్ జిల్లాలోని కోసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఖైర్నా గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పశువుల మేత కోసం సమీప అటవీ ప్రాంతానికి బయలుదేరారు. భారీ వర్షాల వల్ల కోసి నది ఉప్పొంగి వంతెన పై నుంచి ప్రవహిస్తున్నది. ఈ ప్రవాహాన్ని అంచనా వేయలేక పోయిన మహిళలు వంతెనపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. గాలింపు చర్యల్లో ఓ మహిళ మృతదేహం దొరికింది. మరో ఇద్దరు మహిళల కోసం గాలింపులు కొనసాగుతున్నాయి.