రుతుపవనాల ప్రభావంతో రానున్న గంటల్లో గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా గుజరాత్‌లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దేవభూమి ద్వారకాతో సహా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, చాలా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి.
అలాగే సూరత్, వల్సాద్, నవసరి, ద్వారకా, పోరు బందర్, రాజ్‌కోట్ , కచ్ , ఖంభాలియాతో సహా పలు జిల్లాలకు వర్షం హెచ్చరికను IMD జారీ చేసింది. గుజరాత్ మాత్రమే కాదు, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు కూడా వరుసగా నాలుగవ రోజు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం ముంబై, థానేలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.