ఆరువారాల్లో వ్యాక్సిన్ అసాధ్యం: ఎయిమ్స్ డైరెక్టర్

Update: 2020-07-06 13:12 GMT

ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడమనేది అసాధ్యం అంటున్నారు దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ సింగ్ గులేరియా. తుది దశ ట్రయిల్స్ లో మనుషులపై ప్రయోగించి అది సురక్షితమా కాదా అని నిర్ధారించుకోవడానికే కొన్ని నెలల సమయం పడుతుందని అన్నారు. భారత్ లో చాలా కంపెనీలు వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. అందులో భారత్ బయోటెక్ తో పాటు సీరం ఇనిస్టిట్యూట్, క్యాడిలా లాంటి సంస్థలు ఉన్నాయి. లక్షలాది మంది వ్యాక్పిన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతికూల ప్రభావం లేదని నిర్ధారించుకున్న తరువాతే బయటకు రావాలి. రోగనిరోధక శక్తిని పెంచుతుందా లేదా అనేది చూడాలి.

దీనికి కొన్ని వారాల సమయం పడుతుంది. తర్వాత వ్యాక్సిన్ భద్రత గురించి సమీక్ష చేయాలి. ఇవన్నీ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆరువారాల్లో రావడం అనేది జరగదు. కరోనా వైరస్ ఇప్పుడప్పుడే పూర్తిగా అంతరించి పోదు. కేసులు తగ్గడానికి సుమారు 3,4 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నాం. అందరికీ వ్యాక్సిన్ అందించిన తరువాతే వైరస్ తగ్గుతుంది. అప్పుడు గానీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంటుందని గులేరియా తెలిపారు. కేంద్ర శాస్త్ర , సాంకేతిక శాఖ సీనియర్ శాస్త్రవేత్త టి.వి. వెంకటేశ్వరన్ మాట్లాడుతూ కరోనాని కట్టడి చేసే టీకా 2021లోపు అందుబాటులోకి రాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని 'ఇండియన్ సైన్స్ వైర్' పత్రికలో పొందుపరిచారు.

Similar News