విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్‌కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్‌రావులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కొందరు డైరెక్టర్లు, స్టైరిన్ మోనోమార్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2),278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గ్యాస్ లీకేజీ ఘటనలో 12మంది మృతి చెందారు. 585 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ తాజాగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమించింది.