ఫారెస్ట్ ఆఫీసర్ అన్షు తెచ్చిన మార్పు.. ఆ గ్రామం పర్యావరణ హితంతో పాటు రూ.2 కోట్ల ఆదాయాన్నీ..

Update: 2020-07-07 22:04 GMT

ఓ చిన్న గ్రామం.. ప్రకృతి అందాలన్నీ తనలోనే దాచుకుంది. పచ్చని చెట్లు.. పక్షుల కిల కిల రావాలు.. నిరంతరం ప్రవహిస్తున్న నది. ఒడిశా రాష్ట్రంలో మహానది ఒడ్డున ఉన్న నాయగర్ జిల్లా. అక్కడ ఉంది ముదులిగాడియా. ఆ గ్రామంలోని మొత్తం ఇళ్లు 35. వెయ్యి మంది కూడా లేని ఆ ఊరి జనాభాకి తమ ఊరంటే ఎంతో ఇష్టం. ఊరి అందాలను పది కాలాల పాటు కాపాడుకోవాలని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా తీర్చిదిద్దాలని గ్రామ కమిటీ నిర్ణయించింది.

ఆలోచన అయితే వచ్చింది కానీ ఆచరణ ఎలా అనుకుని మహానది డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్షు ప్రగ్యాన్ దాస్ ని సంప్రదించారు. ఆమె ముదులిగాడియా గ్రామాన్ని ఎకో గ్రామంగా తీర్చిదిద్దడానికి పాటు పడ్డారు. ప్రాజెక్టులో భాగంగా అటవీ ప్రాంతంలో ఉన్న సుమారు 45 గ్రామాలు పర్యావరణ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ ప్రదేశాల ద్వారా స్థానికులకు ఆదాయం కూడా సమకూరుతోంది. పర్యావరణ పర్యాటకంలో ఒడిశా భారతదేశంలో ఉన్న ఏకైక కమ్యూనిటీ ఆధారిత మోడల్. ఇక్కడ మొత్తం పర్యాటక ఆదాయంలో 80 శాతానికి పైగా ఆ ఊరి సభ్యులకే వేతనం రూపంలో అందిస్తారు. మిగిలిన 20 శాతం నిర్వహణకు ఉపయోగిస్తారని ఆఫీసర్ అన్షు తెలియజేశారు.

100 శాతం పర్యావరణంతో ఏడాదికి సుమారు రూ.2 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే గ్రామంగా ఒడిశాలోని ఇది మొదటి స్థానంలో నిలిచింది. ముదులిగాడియా నివాసితులు తేనె, కలప వంటి అటవీ వనరులను సేకరిస్తుంటారు. పర్యావరణం, పరిశుభ్రత గురించి సరైన అవగాహన లేదు. నదిలో స్నానం చేయడం, ఆ చుట్టు పక్కలే మల మూత్ర విసర్జన, తాగడానికి అదే నీటిని ఉపయోగించడం వంటివి చేస్తుండే వారు. దీని వల్ల గ్రామంలో తరచూ వ్యాధులు ప్రబలేవి. ఎకో సృష్టి వారి జీవితాన్ని మార్చేసింది. కట్టెల వాడకాన్ని తగ్గించి గ్రామంలో ఎల్ పీజీ కనెక్షన్ ఇప్పించారు అన్షు. ఇండ్లలో నల్లా కనెక్షన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయించారు. చెత్తను వేసేందుకు వీలుగా డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయడంతో పారిశుధ్యం మెరుగుపడింది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు.

సేంద్రియ వ్యవసాయం చేసే దిశగా వారిని ప్రోత్సహించారు. దాంతో గ్రామస్తులు ఆవు పేడతో ఎరువును ఉపయోగించి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. మొక్కలు ఎక్కువగా నాటి గ్రామాన్ని మరింత పచ్చగా ఉండేలా చూశారు. మొత్తం గ్రామానికి ఒక దేవాలయం ఏర్పాటు చేశారు. ఈ మార్పులతో గ్రామస్తులు స్వయంగా ఉపాధి పొందుతున్నారు. ఎకో టూరిజం మా జీవితాలను మార్చేసింది అని ముదులిగాడియా నివాసి ప్రకాష్ బెహెరా హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ముదులిగాడియా గ్రామాన్ని సందర్శించారు. గ్రామ అందలని, చుట్టు పక్కల ప్రాంతాలను పరిరక్షిస్తూ మరింత అందంగా తీర్చి దిద్దిన అధికారులను, స్థానికులను పర్యాటకులు ప్రశంసించారని బెహెరా అన్నారు.

Similar News