యస్ బ్యాంకు కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. లండన్, న్యూయార్క్ ,ముంబైలోని ఆస్తులతో సహా మొత్తం 1,400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఎటాచ్ చేసింది. ఇందులో అతనితోపాటు అతని కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులను కూడా ఎటాచ్ చేసింది.
డిహెచ్‌ఎఫ్‌ఎల్ దివాళా ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధవన్‌ల ఆస్తులను కూడా దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. రానా కపూర్ మరియు అతని కుటుంబ ఆస్తులలో ముంబైలో నివాస భవనం మరియు అనేక ఫ్లాట్లు ఉన్నాయి. 685 కోట్ల విలువైన ఢిల్లీలోని అమృతా షెర్గిల్ మార్గ్‌లోని ఒక బంగ్లాను స్వాధీనం చేసుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ .50 కోట్లు కూడా ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. రానా కపూర్ , వాధవన్ సోదరుల నుంచి ఎటాచ్ చేసిన వీటి విలువ 2,203 కోట్ల రూపాయలని గురువారం అధికారులు ప్రకటించారు.