ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం తెలివైన వ్యాపారవేత్తల లక్షణం. ఇది కరోనా సీజన్. దానికి తగ్గట్టే వ్యాపారాన్ని కూడా మార్చుకోవాలి మరి.. ఈ సీజన్ లో పెళ్లిళ్లు చేసుకుంటే హోదాను చాటుకునేందుకు వీలవ్వట్లేదని ఓ ఐడియా చెప్పమని అడిగాడు పెళ్లికొడుకు. తనకు, కాబోయే భార్యకు వెరైటీ మాస్క్ కావాలని అడిగాడు. దీంతో ఇదే అవకాశంగా భావించిన వ్యాపారి వైరస్ కట్టడికి మాస్క్ ఉపయోగిస్తున్నారు. దానికే వజ్రాలు అంటిస్తే మీ హోదా డబుల్ త్రిబుల్ అవుతుంది అని సలహా ఇచ్చాడు. దాంతో పెళ్లి కొడుకు వజ్రాల మాస్క్ కి ఆర్డర్ ఇచ్చాడు.
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ లో చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు కోరిక మేరకు తమ డిజైనర్లు రూపొందించిన మాస్కులకు మంచి డిమాండ్ ఏర్పడిందని.. దీంతో మరిన్ని వజ్రాల మాస్కులను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నామని ఆభరణాల వ్యాపారి దీపక్ చోక్సీ తెలిపారు. లక్ష రూపాయల నుంచి మొదలు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడితే వజ్రాల మాస్కులు తయారు చేసి ఇస్తామని చెబుతున్నారు. 24 క్యారెట్ గోల్డ్, అమెరికన్ డైమండ్స్ ఉపయోగించి మాస్కులు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అన్ని విధాల సురక్షితమైన వస్త్రాన్నే మాస్క్ తయారీకి ఉపయోగిస్తున్నామని దీపక్ తెలిపారు.
అవసరానికి అనుగుణంగా వేరే నగలు చేయించుకోవాలనుకున్నప్పుడు మాస్క్ నుంచి వజ్రాలు వేరు చేయవచ్చని అంటున్నారు. వజ్రాల మాస్కులకు డిమాండ్ పెరగడంతో ఆర్డర్లు బాగా వస్తున్నట్లు చెప్పారు. పెళ్లిలో దుస్తులకు మ్యాచ్ అయ్యే మాస్కులు తయారు చేయమని కోరుతున్నారు వధూవరులు. మొన్నటికి మొన్న మహారాష్ట్ర పూణెకు చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి 2 లక్షల 89 వేలు పెట్టి బంగారు మాస్క్ ను తయారు చేయించి పెట్టుకున్న సంగతి తెలిసిందే.