అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి ఓ మంచి ఆలోచన వచ్చింది. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నా ఆస్పత్రికి వెళ్లాలంటే వెనుకడుగు వేస్తున్నారు. ఇక బీపీ, షుగర్ పేషెంట్లయితే నెలవారీ చెకప్ లకి కూడా వెళ్లలేని పరిస్థితి. ఆస్పత్రులన్నీ కొవిడ్ రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వెళితే లేని కొవిడ్ వస్తుందేమో అని భయం అందరిదీ.. ఇదే పరిస్థితి గుజరాత్ వాసులదీ. ఈ పరిస్థితుల్లో వారి వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి అవసరమైన చెకప్ లతో పాటు ఔషధాలు అందిస్తే వారికి కాస్త ఉపశమనంగా ఉంటుందని భావించారు.
అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు.. ఫలితంగా ధన్వంతరీ రథ్ ప్రతి ఇంటి ముంగిట్లోకి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు కనుక్కుంటూ అవసరమైతే టెస్టులు చేస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు సూచిస్తున్నారు. వారి ప్రయత్నం ఫలించి కొవిడ్ మరణాల శాతం తగ్గింది. వ్యాధిని ముందుగానే గుర్తించడంతో కేసుల రికవరీ రేటు సైతం పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మొబైల్ మెడికల్ వ్యాన్లు ఆయుర్వేద, హోమియోపతి మందులు, విటమిన్ సప్లిమెంట్స్, ఆక్సీమీటర్లతో పాటు ప్రాథమిక పరీక్షా పరికరాలతో పాటు అవసరమైన మందులు తీసుకువెళతాయి.
అత్యవసర కేసులను సకాలంలో ఆస్పత్రికి చేరవేస్తాయి. నగరంలో ఇప్పటి వరకు 120 మొబైల్ వ్యాన్లు తమ సేవలను వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకు 4 లక్షల మందికి పైగా ఈ మొబైల్ ఆస్పత్రి సేవలను వినియోగించుకున్నారు. అత్యవసర చికిత్స కోసం 462 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆలోచనను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. వారి సేవలను ప్రశంసించారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి మొబైల్ వ్యాన్లను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.